ఆంధ్రప్రదేశ్‌ నైసర్గిక స్వరూపం

  • ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికంగా 1,62,975 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. 
  • ఆంధ్రప్రదేశ్‌ దేశంలో విస్తీర్ణ పరంగా 7 స్థానంలో ఉంది. 
  • ఆంధ్రప్రదేశ్‌ సుమారు 974 కి.మీ తీరరేఖను కలిగి భారతదేశంలో రెండో అతిపెద్ద తీరం కలిగి ఉంది. 
  • 34,572 చదరపు కి.మీ అటవీ విస్తీర్ణం కలిగి, రాష్ట్ర విస్తీర్ణంలో 21.58 శాతం అటవీ భూమి ఆక్రమించి ఉన్నది. 
  • జనాభా పరంగా, ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలోని మొత్తం జనాభాలో ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వాటా 4.10 శాతం.
  • రాష్ట్ర రాజధాని అమరావతి. 

 

నైసర్గిక స్వరూపం

  • తూర్పున బంగాళాఖాతం, పడమర తెలంగాణ, కర్ణాటక, దక్షిణాన తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాన ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లు ఈ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నాయి.
  • ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని సూళ్లూరిపేట వరకూ 974 కిలోమీటర్ల పొడవు గల సముద్రతీర ప్రాంతం ఉండటం ఆంధ్రరాష్ట్ర ప్రత్యేకతల్లో ఒకటి. 
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తెలుగు మాట్లాడతారు. 
  • హిందీ, ఇంగ్లీష్‌, తమిళ్‌ భాషలలో మాట్లాడేవారూ ఉన్నారు. 
  • ఆంధ్రప్రదేశ్‌ వైశాల్యం 1,62,975 చదరపు కిలోమీటర్లుగా ఉంది. దీనిలో కోస్తా ఆంధ్రా ప్రాంతం వైశాల్యం 95,500 చదరపు కిలోమీటర్లు. రాయలసీమ ప్రాంతం వైశాల్యం 67,400 చదరపు కిలోమీటర్లు.

భౌగోళిక విభాగాలు
నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్‌ను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. 
1. సముద్రతీరం మైదానప్రాంతం
2. తూర్పు పశ్చిమ కనుమల ప్రాంతం
3. పీఠభూమి ప్రాంతం

సముద్రతీర మైదాన ప్రాంతం

  • బంగాళాఖాతానికి, తూర్పు కనుమలకు మధ్య ఉన్న మైదాన భూమి వెడల్పు 20 కిలోమీటర్లు మాత్రమే.
  • ఉత్తరాన శ్రీకాకుళం, విశాఖపట్నం, దక్షిణంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సన్నగా, ఈ రెండింటి మధ్య కృష్ణ, గోదావరి నదుల డెల్లా ప్రాంతాంలో విశాలంగానూ ఈ సమతల మైదానం వ్యాపించి ఉంది. 
  • సముద్రతీరం వెంట 10 నుంచి 20 మీటర్ల మేరకు ఇసుకతిన్నెలు ఉంటాయి. 
  • గోదావరి నదికి ఉత్తర దిక్కుకు పోయిన కొద్దీ సముద్ర తీరానికి దగ్గరగా తూర్పు కనుమలు లోపలికి చొచ్చుకొని వచ్చాయి. 
  • విజయనగరం దక్షిణ దిశ నుంచి విశాఖ ఓడరేవు వరకూ యారాడ కొండలు వ్యాపించి ఉన్నాయి. విశాఖ రేవు దగ్గర ఉన్న డాల్ఫిన్స్‌ నోస్‌ ఈ కొండలలోని చివరి భాగమే. ఈ అందమైన కొండలవల్లనే విశాఖ రేవు సముద్ర తరంగాల తాకిడికి తట్టుకుని సహజమైన ప్రముఖ ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. 
  • గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో విశాలంగా విస్తరించివున్న మైదాన ప్రాంతం దేశానికి ధాన్యాగారం వంటిది. ఈ ప్రాంతాన చెమ్మతో కూడిన ఇసుకనేలలు ఎక్కువ. గోదావరి కృష్ణా, పెన్నా నదుల డెల్టాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం సారవంతమైన ఒండ్రునేల. ముఖ్యంగా సప్త గోదావరి ప్రాంతం చాలా సారవంతమైనది. దీనినే కోనసీమ అంటారు. పోక, అనాస, పనస, కొబ్బరి, అరటి తోటలతో, పంట పొలాలతో కన్నుల పండగ చేసే కోనసీమను 'ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనం' అంటారు.
  • తీరం వెంబడి మాత్రం ఇసుకనేలలు, ఊభినేలలు, ఉప్పు నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాలు కనిపిస్తాయి. ఇటువంటివి శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ. అక్కడక్కడ వీటిని ఆనుకుని ఉన్న సారవంతమైన భూముల్లో జీడిమామిడి తోటలు పెంచుతున్నారు. వర్షపాతం కూడా ఆ మైదానంలో సమృద్ధిగా ఉంటుంది. కృష్ణానదీ గర్భంలో ఉన్న దివిసీమ కూడా ఇటువంటిదే. ఈ భూములు వరి, చెరకు, అరటి పంటలతో పాటు సకల ఫల వృక్ష సమన్వితాలు. 
  • ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చక్కని భౌగోళిక విశేషమైన కొల్లేరు మంచినీటి సరస్సు, కృష్ణా, గోదావరి, డెల్లాల్లో మరొక విశేషం. కొల్లేరు సరుస్సు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తరించింది. 
  • అలాగే దక్షిణాన నెల్లూరు జిల్లాకు, తమిళనాడుకు సరిహద్దున సముద్రపు నీరు భూమిలోనికి చొచ్చుకురావడం వల్ల విశాలమైన పులికాట్‌ సరస్సు ఏర్పడింది. 461 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సు అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంది. ఇది చేపల పరిశ్రమకు ప్రసిద్ధి. పులికాట్‌ సరస్సును సముద్రం నుంచి వేరు చేస్తున్న శ్రీహరికోటపై కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాల ఉన్నది.
  • ఆంధ్రాతీరం కృష్ణా ముఖద్వారంలో ఈశాన్య దిశకు వంపు తిరిగింది. అందుకే గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, జిల్లాలకు తూర్పు ప్రాంతంలో ఉన్నాయి. ఇది చాలా చరిత్ర ప్రసిద్ధమైనది. 
  • నెల్లూరు జిల్లా మినహాయించి మిగిలిన ఆంధ్రాతీరాన్ని గోల్కొండ తీరం అనేవారు. నెల్లూరు కోరమండల తీరంలో చేరుతుంది. 
  •  కోస్తా జిల్లాలోని ప్రజలు ప్రాచీన కాలం నుంచి నౌకాయానంలో ఆరితేరి విదేశాలలో వాణిజ్యం చేస్తూ భారతీయ సంస్కృతిని విస్తరింపజేశారు. ఉన్న కారణాలవల్ల తూర్పుతీర మైదానం సస్యశ్యామలమై జనసామ్మర్ధంతో భారతదేశంలో ఒక ఐశ్వర్యవంతమైన ప్రాంతంగా ఉంది. ఇటీవల తీరం వెంబడి పెట్రోలియం సహజవాయువులు పుష్కలంగా లభ్యమవుతున్నాయి.

తూర్పు కనుమలు : తూర్పు కనుమలను వివిధ జిల్లాలో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.

  • విశాఖపట్నం - డాల్ఫినోస్‌ కొండలు
  • గోదావరి - పాపి కొండలు, ధూమా కొండలు
  • గుంటూరు - బెల్లంపల్లి, గవి కొండలు, నాగార్జున కొండలు, కొండవీటికొండలు
  • కృష్ణా - మొఘల్రాజపురం, కొండపల్లి కొండలు
  • నెల్లూరు - ఎర్రమల కొండలు, వెలి కొండలు
  • చిత్తూరు - ఆవుల పల్లి, హార్సిలీ కొండలు, శేషాచల కొండలు

పీఠభూమి ప్రాంతం

           అనాదిగా నీటి ప్రవాహం వల్ల పైనేల కొట్టుకొనిపోయి వర్రెలు, వాగులు ఏర్పడి పైన సమతలంగా ఉంచి రాచి గుట్టలతో నిండి ఉన్న మైదానం పీఠభూమి, తూర్పు కనుమలకు పశ్చిమంగా సువిశాలమైన దక్కన్‌ పీఠభూమి ఉంది. మధ్య పీఠభూమిలోపల సీసపురాయి, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాలో పలుగురాళ్లు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సున్నపురాయి దొరుకుతుంది. నల్లసీసపురాయి సుందరశిల్పాలు చెక్కడానికి అనువుగా ఉంటుంది. 

          పీఠభూమిలో అనేక ఖనిజాలు దొరుకుతున్నాయి. కర్నూలు, కడప జిల్లాల్లో ఇనుము, శ్రీకాకుళం, విశాఖలో మాంగనీసు, నెల్లూరులో అభ్రకం, అగ్నిగుండాల, గుంటూరులో రాగి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆస్‌బెస్టాస్‌, అనంతపురంలో వజ్రాలు లభిస్తున్నాయి. ఇవికాక అనేక రంగుల పాలరాళ్లు చాలా ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. 

         పీఠభూమి చాలా ప్రాంతం ఎర్రరాతినేలలు వాయువ్య దక్షిణ ప్రాంతాలలో నల్లరేగడి భూములున్నాయి. దక్కను పీఠభూమి వాయువ్య దిశ నుంచి ఆగేయదిశకు వాలుగా ఉన్నందువల్ల గోదావరి, కృష్ణ మొదలైన నదులన్నీ తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

కోస్తా తీరప్రాంతం

          భారతదేశంలో గుజరాత్‌ తరువాత అతిపెద్ద కోస్తా తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది జిల్లాలు కోస్తా తీరప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. అత్యదిక తీరప్రాంతం 220 కిలోమీటర్లు గల జిల్లా శ్రీకాకుళం. తరువాత 169 కిలోమీటర్లతో నెల్లూరు తీరప్రాంతం ఉంది. వివిధ జిల్లాల్లో కోస్తా తీరప్రాంతాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

వివిధ జిల్లాల కోస్తా తీరప్రాంతాలు
జిల్లా                            తీరరేఖ పొడవు కి.మీ
శ్రీకాకుళం                           - 200
విజయనగరం                       - 29
విశాఖపట్నం                       - 136
తూర్పు గోదావరి                   - 161
పశ్చిమ గోదావరి                   - 20
కృష్ణా                                - 111
గుంటూరు                          - 43
ప్రకాశం                              - 105
నెల్లూరు                             - 169

మొత్తం                             - 974