Showing posts with label పాలిటి. Show all posts
Showing posts with label పాలిటి. Show all posts

105 రాజ్యాంగ సవరణ

 

           జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్సభ ఆగస్టు 10 ఆమోదం తెలిపింది

         127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆగస్టు 18 రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 105 రాజ్యాంగ సవరణ జరిగింది. 105 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 338B మరియు 342A సవరించ బడ్డాయి.

         జాతీయ బీసీ కమిషన్విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5 కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342 చెబుతోందని, 102 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది.

పార్లమెంట్ సమావేశాలు

సమాపనం (Summoning)

         పార్లమెంటులో రెండు సమావేశాలకు మధ్య గరిష్ట కాల పరిమితి 6 నెలలు మించరాదు. సంవత్సరంలో కనీసం రెండు సార్లు పార్లమెంట్ సమావేశం కావాలి. సాధారణంగా ఒక సంవత్సరంలో మూడు (3) రకాల సమావేశాలు ఉంటాయి. ప్రతి సభను రాష్ట్రపతి సమాపనం చేస్తాడు.

  • బడ్జెట్ సమావేశం (ఫిబ్రవరి నుండి మే వరకు)
  • వర్షాకాల సమావేశం ( జూలై నుండి సెప్టెంబర్‌)
  • శీతాకాల సమావేశం(నవంబర్ నుండి డిసెంబర్‌)

          పార్లమెంట్ లో సమావేశం అనగా మొదటి రోజు నుండి సభవాయిదా పడటం వరకు (లోక్ సభ అయితే రద్దు అయ్యే వరకు) మధ్య ఉన్న కాలవ్యవధి. సమావేశ సమయంలో, సభ తన కార్యక్రమాల కోసం ప్రతి రోజు సమావేశం అవుతుంది. సభ వాయిదా పడ్డ తర్వాత నుండి సభ మళ్లీ కొత్తగా సమావేశమయ్యే మధ్య కాలాన్ని విరామం అంటారు.

 

వాయిదా (Adjournment)

              ఒక సమావేశ కాలంలో పార్లమెంట్ అనేక సార్లు సభలు నిర్వహి స్తుంది. ప్రతి రోజు సభ రెండు సార్లు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటగా సభా కార్యకలాపాలు జరుగుతాయి. మధ్యాహ్న భోజనం తర్వాత సభా
              కార్యక్రమాలు రెండవసారి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. ఈ సభా కార్యక్రమాలు వాయిదా ద్వారా లేక నిరవధిక వాయిదా ద్వారా లేదా రద్దు (లోక్ సభ) ద్వారా కానీ ముగి యవచ్చును. వాయిదా ద్వారా సభా కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచి పోతాయి. ఈ నిలుపుదల గంటలు, రోజులు లేదా వారాలు కావచ్చును.

వాయిదా వ‌ల్ల‌..

  • 1. దీని వలన సభా కార్యక్రమం మాత్రమే ముగుస్తుంది. సమావేశం ముగియదు.
  • 2. ఈ అధికారం సభాధ్యక్షునికి ఉంటుంది.
  • 3. బిల్లులపై గానీ, సభలో విచారణలో ఉన్న ఇతర కార్య క్రమాలపై దీని ప్రభావం ఉండదు.

 

నిరవధిక వాయిదా (Adjournment Sine Die)

            పార్లమెంట్ సమావేశాన్ని ఏ కాలపరిమితి తెలపకుండా నిరవధికంగా వాయిదా వేయడాన్ని నిరవధిక వాయిదా అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే, సభ తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందో పేర్కొన కుండా సభను వాయిదా వేయడాన్ని నిరవధిక వాయిదా అంటారు. సంబంధిత సభాధ్యక్షునికి సభను వాయిదా లేదా నిరవధిక వాయిదా వేసే అధికారం ఉంటుంది. వాయిదా వేసిన తేదీకి లేదా సమయానికి ముందు కూడా అతడు సభను తిరిగి సమావేశ పర్చవచ్చును. సభను నిరవధికంగా వాయిదా వేసినట్లయితే అతడు సభను ఎప్పుడైనా తిరిగి సమావేశపరచవచ్చును.

 

దీర్ఘకాలిక వాయిదా (Prorogation)

                 సమావేశాల కార్యక్రమాలు ముగిసిన తర్వాత సభాధ్యక్షుడు (స్పీకర్ లేదా చైర్మన్) సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. కొన్ని రోజుల తర్వాత, రాష్ట్రపతి సమావేశాన్ని దీర్ఘకాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తారు. అయితే రాష్ట్రపతి సభ సమావేశంలో ఉన్నప్పుడు కూడా సభను దీర్ఘకాలికంగా వాయిదా వేయవచ్చును.

దీర్ఘ‌కాలిక వాయిదా వ‌ల్ల‌..

  • 1. సభా కార్యక్రమం మరియు సమావేశం రెండూ ముగుస్తాయి.
  • 2. ఈ అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
  • 3. దీని వలన గూడా బిల్లులపై గానీ, సభలో విచారణలో ఉన్న ఇతర కార్యక్రమాలపై గానీ ప్రభావం ఉండదు. అయితే, విచారణలో ఉన్న అన్ని నోటీసులు (బిల్లులను ప్రవేశపెట్టేవి తప్ప) దీర్ఘకాలిక వాయిదాతో రద్దవుతాయి. తదుపరి సమావేశంలో కొత్త నోటీన్లు జారీ చేయవలసి వస్తుంది. బ్రిటన్లో వాయిదా వలన అన్నీ బిల్లులు మరియు సభలో విచారణలో ఉన్న ఇతర కార్య క్రమాలు రద్దు అవుతాయి.

 

రద్దు (Dissolution)

             శాశ్వత సభగా ఉన్న రాజ్యసభ రద్దు కాదు. లోకసభ మాత్రమే రద్దవుతుంది. దీర్ఘకాలిక వాయిదా వలే కాకుండా ‘రద్దు’ వలన ప్రస్తుత సభాజీవితం ముగుస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత కొత్త లోకసభ ఏర్పడుతుంది. లోక్ సభ రద్దు రెండు రకాలుగా ఏర్పడుతుంది. అవి:

  • 1. స్వతహాగా రద్దవుతుంది. అనగా దాని కాలపరిమితి ఐదు సంవత్సరాల తర్వాత లేదా జాతీయ అత్యవసర పరిస్థితు లలో దాని కాలపరిమితి పొడగించిన షరతులను బట్టి.
  • 2.. తనకున్న అధికారంతో రాష్ట్రపతి సభను రద్దు చేయడానికి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చును. సాధారణ కాల పరిమితి కన్నా ముందే ఒకసారి లోకసభ రద్దయితే, దానిని ఉపసంహరించడం సాధ్యం కాదు.

               లోక్సభ రద్దయినప్పుడు దాని ముందు లేదా దాని కమిటీలలో విచారణలో ఉన్న బిల్లులు, ప్రతిపాదనలు, తీర్మానాలు, నోటీసులు, పిటిషన్లు మొదలగునవి కూడా రద్దవుతాయి. వాటిని క్రొత్త లోక్ సభలో తిరిగి ప్రవేశపెట్టవలసి వస్తుంది. అయితే, ప్రభుత్వ

                 హామీల కమిటీలో పరిశీలనలో ఉన్న కొన్ని బిల్లులు మరియు హామీలు మాత్రం రద్దు కావు. లోక్ సభ రద్దయినప్పుడు వివిధ బిల్లుల మనుగడ పరిస్థితి ఈ క్రింది విధంగా ఉంటుంది.

  • లోక్ సభలో విచారణలో ఉన్న బిల్లు రద్దువుతుంది. (అది లోకసభలో ప్రవేశ పెట్టినా లేదా రాజ్యసభ నుండి లోక్సభకు వచ్చినా)
  • లోకసభలో ఆమోదించబడి రాజ్యసభలో విచారణలో ఉన్న బిల్లు కూడా రద్దవుతుంది.
  • ఒక బిల్లు విషయంపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, దానిని తొలగించడానికి రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు లోకసభ రద్దయినా బిల్లు ర‌ద్దు కాదు.
  • రాజ్యసభ పరిగణనలో ఉన్న బిల్లులు లోకసభ ఆమోదానికి రానప్పుడు, ఆ బిల్లు రద్దు కాదు.
  • ఉభయ సభలచే ఆమోదింపబడి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు రద్దు కాదు.
  • ఉభయ సభలచే ఆమోదింపబడి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు, రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ పున: పరిశీలనకు పంపినప్పుడు కూడా బిల్లు రద్దు కాదు.

 

కోరం (Quorum)

           సభా కార్యక్రమాలు నిర్వహించడానికి సభలో ఉండవలసిన కనీస సభ్యుల సంఖ్యని కోరం అంటారు. సభాధ్యక్షుడితో సహా మొత్తం సభలోని సభ్యులలో 10శాతం సభ్యులు సభకు హాజరైతే, దానిని కోరం అంటారు. దీనిని బట్టి లోక్ సభలో కోరం ఏర్పడటానికి కనీసం 55 మంది సభ్యులు ఉండాలి. అదే విధంగా రాజ్యసభలో 25 మంది సభ్యులు ఉండాలి. సభా సమావేశంలో కోరం లేకపోతే, అవి ఏర్పడే దాకా, సభా అధ్యక్షుడు సభని రద్దు చేయ వచ్చును లేదా సస్పెండ్ చేయవచ్చును.

 

సభలో ఓటింగ్

          లోకసభలో కానీ లేదా రాజ్యసభలో కానీ, లేదా ఉభయసభల ఉ మ్మడి సమావేశాలలో కానీ జరిగే ఓటింగ్ ప్రక్రియ ప్రకారం సభలో హాజరై మరియు ఓటింగ్ లో పాల్గొన్న మెజారరిటీ ఓట్లను బట్టి (సభాధ్యక్షుడి మినహా) వ్యవహారాలు నిర్ణయింబడతాయి. రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్న కొన్ని అంశాలకి, అనగా రాష్ట్రపతిని తొలగించడం, రాజ్యాంగాన్ని సవరించడం, పార్లమెంట్ సభాధ్యక్షులను తొలగించడం వంటి అంశాలను మాత్రం సాధారణ మెజారిటీ కాకుండా ప్రత్యేక మెజారిటీ ఉండాలి.

            సభాధ్యక్షుడు మొదటిసారి ఓటు వేయడు. కానీ, సభలో ఓట్లు సమానంగా ఏర్పడ్డప్పుడు అతను తన నిర్ణయాత్మక ఓటు వేస్తారు. సభలో ఏదైనా ఖాళీలు ఉన్న సభాకార్యక్రమాల నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి.

 

పార్లమెంటులో భాష

              సభా కార్యక్రమాలలో హిందీ మరియు ఇంగ్లీష్ ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అయితే, సభాధ్యక్షుని అనుమతితో సభ్యుడు తన మాతృభాషలో ప్రసంగించవచ్చును. దీని అనువాదానికి సభలో ఏర్పాటు ఉంటాయి. రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత (1965 తర్వాత) ఇంగ్లీష్ ని సభలో కొనసాగించరాదని భావించినప్పటికీ, అధికార భాషా చట్టం (1963) హిందీతో ఇంగ్లీష్ ని కొనసాగించాలని నిర్ణయించింది.

 

మంత్రులకు మరియు అటార్నీ జనరలకు గల హక్కులు

             సభలోని సభ్యులే కాక, ప్రతి మంత్రికి మరియు అటార్నీ జనరల్‌కు పార్లమెంట్ లో ఏ సభలోనైనా లేదా ఉమ్మడి సమావేశంలోనైనా లేదా ఏ కమిటీలోనైనా పాల్గొనే హక్కు మరియు ప్రసంగించే హక్కు ఉన్నాయి. రాజ్యాంగ అంశాల ప్రకారం;

  • 1. ఒక సభలో సభ్యుడు కాకపోయినా ఒక మంత్రి ఆ సభా కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించవచ్చును. అనగా, లోక్ సభకు చెందిన మంత్రి రాజ్యసభలో లేదా ఇతరత్రా పాల్గొనవచ్చును.
  • 2. ఏ సభలో సభ్యుడు కాని మంత్రి కూడా రెండు సభలలో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఏ సభలో సభ్యత్వం లేకున్నా మంత్రిగా ఉండవచ్చును.

 

కుంఠిత సమావేశం (Lame duck Session)

              కొత్త లోకసభ ఏర్పడిన తర్వాత ప్రస్తుత లోకసభ యొక్క చివరి సమావేశం ఇది. కొత్త లోకసభకు ఎన్నిక కాలేని ప్రస్తుత లోకసభ సభ్యులను లేమ్ డక్స్ అంటారు.

 

పార్లమెంట్ సభాధ్యక్షులు

       పార్లమెంట్ లో ప్రతి సభకూ ఒక అధ్యక్షుడు ఉంటారు. లోక్ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. లోక్ సభకు ఒక చైర్ పర్సన్ల ప్యానల్ మరియు రాజ్యసభకు వైస్ చైర్ పర్సన్ల ప్యానల్ కూడా ఉంటాయి.


లోక్ సభ స్పీకర్

ఎన్నిక, పదవీకాలం

       లోక్ సభ ఏర్పాటైన వెంటనే వీలైనంత త్వరగా లోక్ సభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగా (స్పీకర్ గా) ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి ఖాళీ అయితే సభలోని సభ్యులు ఇంకొకరిని ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు.

        సాధారణంగా, లోక్ సభ ఉన్నంత కాలం స్పీకర్ పదవిలో ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల పదవి నుండి తొలగవలసి వస్తుంది. అవేంటంటే..

  • అతడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు,
  • ఉప సభాపతికి (డిప్యూటీ స్పీకర్ కి) లిఖిత పూర్వకంగా తన  రాజీనామా పత్రం ఇచ్చినప్పుడు
  • లోక్ సభలోని మెజారిటీ సభ్యులు అతడిని ఒక తీర్మానం ద్వారా తొలగించినప్పుడు. ఈ తీర్మానం చేయాలంటే 14 రోజుల ముందుగా స్పీకర్ కు నోటీసు ఇవ్వాలి.

            సభలో తనని తొలగించే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు, స్పీకర్ సభలో ఉన్నా సభను నిర్వహించొద్దు. అయితే అతడు సభలో మాట్లాడొచ్చు. తీర్మానంపై జరుగు చర్చలో పాల్గొనవచ్చు. తొలుత ఓటింగ్ జరిగినప్పుడు మొదటి దఫా మాత్రమే ఓటు వేయొచ్చు. సమాన సంఖ్యలో ఓట్లు వస్తే ఓటేసే హక్కు ఉండదు.

            లోక్ సభ రద్దయినా స్పీకర్ పదవిలో ఉంటారు. తిరిగి కొత్త లోక్ సభ ఏర్పడి అది తొలిసారి సమావేశమయ్యే వరకు స్పీకర్ తన పదవిలో కొనసాగవచ్చు.

 

పాత్ర, అధికారాలు మరియు విధులు

           స్పీకర్ లోక్ సభకు అధినేతగా, ప్రతినిధిగా ఉంటారు. సభ్యుల అధికారాలు, హక్కులకు, సభలోని కమిటీలకు సంరక్షకుడిగా ఉంటాడు. పార్లమెంటరీ వ్యవహారాలలో అతని నిర్ణయం అంతిమం. ఈ విధంగా అతడు సభలో సభాధ్యక్షుడి కన్నా (ప్రధాని) ఎక్కువే. ఈ హోదాలో అతినికి విశేషమైన,  ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. సభలో అత్యున్నత హోదాను, గౌరవాన్ని, అధికారాన్ని అతడు కలిగి ఉంటారు.

           లోక్ సభ స్పీకర్ తన అధికారాలను, విధులను మూడు మూలాల నుండి గ్రహిస్తారు. అవి భారత రాజ్యాంగం, లోక్ సభ కార్యక్రమాల నిర్వహణలో వివిధ పద్ధతులు, పార్లమెంటరీ సాంప్రదాయాలు. మొత్తం మీద అతనికి ఈ క్రింది అధికారాలు, విధులు ఉంటాయి.

  • సభ క్రమశిక్షణను, హెూదాను కాపాడతాడు. ఇది అతని ప్రధాన బాధ్యత. దీని కోసం అతనికి పూర్తి అధికారాలు ఉన్నాయి.
  • భారత రాజ్యాంగం, లోక్ సభ కార్యకలాపాల నిర్వహణ, నిబంధనల పద్ధతులు, సభలో పార్లమెంటరీ ప్రమాణాలకు అర్థ వివరణ ఇచ్చే అధికారం ఉంది.
  • సభను వాయిదా వేయగలడు. కోరం లేకపోతే సమావేశాన్ని సస్పెండ్ చేయగలడు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం పదవ వంతు సభ్యులు హాజరైతే దాన్ని కోరం అంటారు. సమావేశాన్ని నిర్వహించడానికి ఈ కోరం అవసరం.
  • సభలో మొదటిసారి అతడు ఓటు వేయడు. టై ఏర్పడ్డప్పుడు తన కాస్టింగ్ ఓటు వేయొచ్చు. సభలో సంక్షోభాన్ని నివారించడమే దీని ధ్యేయం.
  • పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఏదైనా బిల్లు విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు రాష్ట్రపతి ఇటువంటి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పరుస్తాడు.
  • సభా నాయకుడి విజ్ఞాపనపై స్పీకర్ రహస్య సభా సమావేశాన్ని నిర్వహించవచ్చు. సభ రహస్య సమావేశంలో ఉన్నప్పుడు స్పీకర్ అనుమతి లేకుండా చాంబర్లో కాని, లాబీలో కాని, గ్యాలరీస్ కాని ఎవరూ ఉండొదు.
  • ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా నిర్ణయించడంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం. ఆర్థిక బిల్లుని రాజ్యసభకు సిఫార్సు కోసం పంపించినప్పుడు, రాష్ట్రపతి ఆమోదానికి దాన్ని సమర్పించినప్పుడు స్పీకర్‌కు ఆర్థిక బిల్లు అని నిర్దేశించి సంతకం చేస్తారు.
  • 10వ షెడ్యూల్డ్ అంశాలని బట్టి ఎవరైనా లోక్‌సభ సభ్యడు అనర్హతకు గురి అయినట్టయితే ఆ అనర్హత వివాదాలను స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్ష కిందకి వస్తుందని 1992లో సుప్రీంకోర్టు ప్రకటించింది.
  • ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ కి ఇతను ఎక్స్ ఆఫీషియో చైర్మన్‌గా ఉంటారు. దేశంలోని శాసన సంస్థల సభా అధ్యక్షుల అధికారుల సమావేశానికి కూడా ఇతను ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటాడు.
  • లోక్ సభలోని అన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్లను ఇతనే నియమిస్తారు. వారి విధుల నిర్వహణను పర్యవేక్షిస్తాడు. అంతే కాకుండా రూల్స్ కమిటీకి మరియు జనరల్ పర్పస్ కమిటీకి ఇతనే చైర్మన్ గా ఉంటాడు.

 

స్వతంత్రత మరియు నిష్పాక్షికత

స్పీకర్ పదవికి నిష్పాక్షికతను, స్వతంత్రతను ఈ క్రింది అంశాలు కలుగజేస్తాయి.

  • అతని పదవికి రక్షణ ఉంది. లోక్ సభ ప్రత్యేక మెజారిటీ ఒక తీర్మానం ద్వారానే స్పీకర్ ను తొలగిస్తుంది. (అనగా సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ). సాధారణ మెజారిటీతో ఇతను తొలగింపబడడు (సభలో హాజరై ఓటు వేసే సభ్యులలో మెజారిటీ). పైగా ఈ తొలగింపు తీర్మానం పరిశీలించబడాలంటే మరియు చర్చింప బడాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి.
  • ఇతని జీతభత్యాలని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీటిని భారత సంచిత నిధి ద్వారా ఇవ్వబడతాయి. కాబట్టి పార్లమెంట్ వార్షిక ఓటు కిందికి ఇవి రావు.
  • ఒక స్థిరమైన , దృఢమైన తీర్మానం పై తప్ప అతని పని తీరు, ప్రవర్తనను లోక్ సభలో చర్చించొద్దు. విమర్శించవద్దు.
  • సభా నిర్వహణలో కార్యక్రమాల వ్యవస్థీకరణలో గల అతని అధికారాలు న్యాయస్థానం పరిధిలోకి రావు.
  • అతను మొట్టమొదటి సారి ఓటు వేయడు. ఓటింగ్ లో టై అయినప్పుడే అతను కాస్టింగ్ ఓటు అనగా నిర్ణ యాత్మక ఓటు వేస్తాడు. దీని వలన స్పీకర్  నిష్పక్షపాతంగా ఉంటాడు.
  • అగ్రత క్రమావళిలో ఇతని హెూదా ఉన్నతమైనది. భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఇతను ఏడవ శ్రేణిలో ఉంటాడు. అనగా ప్రధానమంత్రి లేదా డిప్యూటీ ప్రధాన మంత్రిని మినహాయిస్తే క్యాబినెట్ మంత్రులందరి కన్నా ఇతని హెూదానే పెద్దది.

          బ్రిటన్ లో స్పీకర్ ఖచ్చితంగా పార్టీ రాహిత్య వ్యక్తి. బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం స్పీకర్ తన పార్టీ నుంచి రాజీనామా చేసి రాజకీయంగా తటస్థంగా ఉండాలి. భారతదేశంలో ఈ సాంప్రదాయం ఇంకా  ఏర్పడలేదు. ఈ ఉన్నతమైన పదవిలోకి వచ్చినప్పటికీ భారతదేశంలో స్పీకర్ తన పార్టీకి రాజీనామా చేయరు.

 

లోక్ సభ డిప్యూటీ స్పీకర్

          స్పీకర్ లా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా లోక్ సభ సభ్యుల ద్వారా జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల తేదీని స్పీకర్ నిర్ణయిస్తాడు. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడితే లోక్ సభ ఇంకొక సభ్యుడ్ని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటుంది.

          స్పీకర్ వలె డిప్యూటీ స్పీకర్ కూడా లోక్ సభ ఉన్నంత కాలం ఉంటారు. ఈ క్రింది మూడు కారణాల చేత అతడు పదవి నుండి తొలగవచ్చును.

  • లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు,
  • స్పీకర్ కు లిఖిత పూర్వకంగా రాజీనామాను అందజేసినప్పుడు,
  • లోక్‌సభలోని అందరి సభ్యుల మెజారిటీతో ఏర్పడిన ప్రత్యేక తీర్మానం ద్వారా తొలగింపబడ్డప్పుడు

          ఇటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అతనికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.

          స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ అతని విధులని నిర్వహిస్తారు. సభలో స్పీకర్ లేనప్పుడు కూడా అతను సభను నిర్వహిస్తారు. ఈ రెండు సందర్భాలలో అతనికి స్పీకర్ కు ఉన్న అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ లేనప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి కూడా ఇతను అధ్యక్షత వహిస్తారు.

            డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కు సబార్డినేట్ కాడు. అతను సభకు ప్రత్యేకంగా బాధ్యత వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ కు ఒక ప్రత్యేకమైన హెూదా ఉంది. ఏదైనా పార్లమెంటరీ కమిటీకి అతడు సభ్యుడైతే వెంటనే దానికి చైర్మన్ అవుతాడు.

             స్పీకర్ వలే డిప్యూటీ స్పీకర్ కూడా సభా నిర్వహణలో ఓటు వేయడు. అతను సభలో టై ఏర్పడ్డప్పుడే కాస్టింగ్ ఓటు వేస్తాడు. అతనిని తొలగించే తీర్మానం లోక్ సభ పరిశీలనలో ఉన్నప్పుడు అతడు సమావేశాలని నిర్వహించరాదు. కాని సభకు హాజరు కావచ్చు.

           సభలో స్పీకర్ అధ్యక్షత వహించినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇతర సభ్యులలానే సాధారణ సభ్యుడిగా ఉంటాడు. అతడు సభలో ప్రసంగిం చవచ్చు, సభా కార్యకలాపాలలో పాల్గొనవచ్చును. సభలో ఏ అంశాలపైనా అతను ఓటు వేయవచ్చును.

           పార్లమెంట్ నిర్ణయించిన క్రమబద్ధమైన జీతభత్యాలు డిప్యూటీ స్పీకర్ కు ఉంటాయి. ఇవన్నీ భారత సంచిత నిధి నుంచే వస్తాయి.

         పదవ (10) లోక్ సభ వరకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ సాధారణంగా అధికార పార్టీకి చెంది ఉండేవారు. కానీ పదకొండవ (11) లోక్ సభ నుండి ఒక సాధారణ ఒప్పందం ద్వారా అధికార పార్టీ నుండి లేదా అధికార కూటమి నుంచి స్పీకర్ మరియు ప్రధాన ప్రతిపక్షం నుంచి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కావడం ఒక సాంప్రదాయం అయింది.

           తమ పదవులని స్పీకరించేటప్పుడు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ప్రత్యేకంగా ప్రమాణము, ప్రతిజ్ఞ చేయరు.

          భారత ప్రభుత్వ చట్టం (1919) (మాంటెగు-ఫేమ్స్ ఫర్డ్ సంస్కరణలు) కింద 1921లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనే సంస్థలు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో స్పీకర్ ను, డిప్యూటీ స్పీకర్ ను ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవారు. ఈ పేర్లు 1941 వరకు కొనసాగాయి. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అనే పేర్ల స్థానంలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఏర్పాడ్డాయి. అయినా 1935 చట్టంలోని సమాఖ్య భాగం అమలులోనికి రాని కారణంగా పాత పేర్లే అమలులో ఉన్నాయి. లోక్ సభకు మొట్టమొదటి స్పీకర్ జి.వి.మౌలంకర్, మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్. శాసనసభగా పనిచేసిన రాజ్యాంగ నిర్మాణ సభకు, తాత్కాలిక పార్లమెంట్ కు జి.వి.మౌలంకర్ స్పీకర్ గా పనిచేశారు. ఆయన దశాబ్దం కాలం అనగా 1946 నుంచి 1956 వరకు లోక్ సభ స్పీకర్ గా సేవలు అందించారు.

 

లోక్ సభలోని చైర్ పర్సన్ల జాబితా

         లోక్ సభ నిబంధనల ప్రకారం స్పీకర్ లోక్ సభలోని సభ్యుల్లో 10 మందికి మించకుండా లోక్ సభ చైర్ పర్సన్ జాబితాలో నామినేట్ చేస్తారు. స్పీకర్ కాని, డిప్యూటీ స్పీకర్ కాని లేనప్పుడు వీరిలో ఒకరు సభను నిర్వహించవచ్చు. సభ నిర్వహించేటప్పుడు స్పీకర్ కి ఉన్న అధికారాలే ఈ సభా నిర్వాహకుడికి ఉంటాయి. కొత్త జాబితాతో చైర్ పర్సన్లని నామినేట్ చేసే వరకు అతను పదవిని నిర్వహిస్తారు. ఈ జాబితాలో ఉన్న ఏ సభ్యుడు సభలో లేకపోతే సభ నిర్ణయించిన ఏ వ్యక్తి అయినా స్పీకర్‌గా వ్యవహరిం చవచ్చు.

         స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు చైర్ పర్సన్ల జాబితాలోని ఏ సభ్యుడు సమావేశాలను నిర్వహించరాదు. ఇటువంటి సమయంలో సభని నిర్వహించడానికి రాష్ట్రపతి నియమించిన సభ్యుడు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తాడు. సాధ్యమైనంత త్వరగా ఈ ఖాళీ అయిన స్థానాలలో ఎన్నికలు జరగాలి.

 

తాత్కాలిక స్పీకర్ (Speaker ProTem):

          కొత్తగా లోక్ సభ మొదటిసారి సమావేశమైన తక్షణం పాత లోక్ సభ స్పీకర్ తన పదవి నుంచి తప్పుకుంటారు. రాష్ట్రపతి లోక్ సభకు ఒక తాత్కాలిక స్పీకర్ ను ఎంపిక చేస్తారు. ప్రొటెమ్ స్పీకర్ చేత ప్రమాణం చేయించేది రాష్ట్రపతే. స్పీకర్ కు ఉన్న అన్ని అధికారాలు ప్రొటెమ్ స్పీకర్ కు ఉంటాయి. కొత్తగా ఏర్పడిన లోక్ సభ మొదటి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఇతని ప్రధాన బాధ్యత. కొత్త స్పీకర్ ని సభ ఎన్నుకోవడానికి ఆయన తోడ్పడుతారు. సభకి కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ప్రొటెమ్ స్పీకర్ పదవి ఉండదు. కనుక ప్రొటెమ్ స్పీకర్ పదవి తాత్కాలికమైనది. ఇది కొన్ని రోజుల వరకే ఉంటుంది.

 

రాజ్యసభ చైర్మన్

          రాజ్యసభ సమావేశాలని నిర్వహించే అధికారిని చైర్మన్ అంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభలో ఎక్స్ అఫిషీయో చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి పదవి నిర్వహించి నప్పుడు ఇతను రాజ్యసభ సమావేశాలను నిర్వహించడు.

             ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగింపబడినప్పుడు రాజ్యసభ చైర్మన్ కూడా తొలగించబడినట్టే. లోక్ సభ స్పీకర్ కి ఉన్న అధికారాలే రాజ్యసభ చైర్మన్ కి కూడా ఉంటాయి. అయితే స్పీకర్ కి రెండు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

  • ఏదైనా బిల్లు ఆర్థిక బిల్లు అవునా, కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్ కు మాత్రమే ఉంటుంది. అతని నిర్ణయమే అంతిమం.
  • పార్లమెంట్ లోని రెండు సభల ఉమ్మడి సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.

         స్పీకర్ సభలో సభ్యుడిగా ఉంటాడు కానీ చైర్మన్ సభలో సభ్యుడు కాదు. అయితే స్పీకర్ లా చైర్మన్ కూడా మొదటిసారి ఓటు వేయడు. ఏదైనా తీర్మానంపై సభలో ఓట్లు సమానంగా వచ్చినప్పుడు కాస్టింగ్ ఓటు వేస్తాడు.

          తనని తొలగించే తీర్మానం సభలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభలో చైర్మన్ గా వ్యవహరించడు. కాని అతను సభకి హాజరు కావచ్చు, ప్రసంగిచవచ్చు. సభా కార్యకలాపాల్లో అతడు పాలు పంచుకోవచ్చును. కానీ ఓటు హక్కు ఉండదు.

          స్పీకర్, చైర్మన్ జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అవి భారత సంచిత నిధి నుండి వస్తాయి. అవి పార్లమెంట్ వార్షిక ఓటుకి ఆధీనం కాదు.

          ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులను నిర్వహించేటప్పుడు అతడికి రాజ్యసభ చైర్మన్‌గా జీత భత్యాలు ఉండవు. కానీ ఆ సమయంలో అతడికి రాష్ట్రపతికి వచ్చే జీతభత్యాలు వస్తాయి.

 

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

         రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ (ఉపాధ్యక్షులు)గా ఎన్నుకుంటారు. ఈ పదవికి ఖాళీ ఏర్పడితే మరొక డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకుంటారు.

          డిప్యూటీ చైర్మన్ పదవికి ఖాళీ ఈ క్రింది మూడు కారణాల వలన ఏర్పడుతుంది.

  • అతడు రాజ్యాసభ సభ్యునిగా కొనసాగే అర్హత కోల్పోవడం,
  • రాజ్యసభ చైర్మన్ కు లిఖిత పూర్వకంగా రాజీనామా ఇచ్చినప్పుడు,
  • రాజ్యసభ మెజారిటీ తీర్మానం ద్వారా అతనిని తొలగించడం. అయితే అతడిని తొలగించే తీర్మానం ప్రవేశపెట్టడానికి అతడికి 14 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి.

         చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నపుడు లేదా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు లేదా రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్, చైర్మన్ గా విధులను నిర్వర్తిస్తారు. చైర్మన్ సభలో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్, చైర్మన్ గా వ్యవహరిస్తారు. అనగా రెండు సందర్భాలలో అతడు చైర్మన్ గా విధులను నిర్వహిస్తాడు.

             డిప్యూటీ చైర్మన్ చైర్మన్ కి సబార్డినేట్ కాదు. అతను రాజ్యసభకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తాడు. చైర్మన్ లా డిప్యూటీ చైర్మన్ కూడా సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు మొదటిసారి ఓటు వేయడు. సభలో టై ఏర్పడ్డప్పుడు అతను కాస్టింగ్ ఓటు వేస్తాడు. అయితే తనని తొలగించే తీర్మానం రాజ్యసభలో ఉన్నపుడు అతను సభకు అధ్యక్షత వహించడు. కాని అతడు సభకు హాజరుకావచ్చు.

          సభలో చైర్మన్ సమావేశాలని నిర్వహిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ ఇతర సభ్యుల వలె ఉంటాడు. అతడు సభలో ప్రసంగివచ్చ వచ్చును, కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సభలో ఓటింగ్ లో పాల్గొనవచ్చు.

           చైర్మన్ వలె డిప్యూటీ చైర్మన్ కు కూడా పార్లమెంట్ నిర్ణయించిన మేరకు జీతభత్యాలు ఉంటాయి. ఇవి భారత సంచిత నిధి నుండి వస్తాయి.

 

రాజ్యసభలో వైస్ చైర్ పర్సన్ల జాబితా

          రాజ్యసభ నిబంధనల ప్రకారం చైర్మన్ రాజ్యసభలోని సభ్యుల్లో 10 మందిని మించకుండా రాజ్యసభవైస్ చైర్ పర్సన్ల జాబితాలో నామినేట్ చేస్తారు. చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కాని లేనప్పుడు వీరిలో ఏ ఒక్కరైనా సభను నిర్వహించవచ్చును. సభ నిర్వహించేటప్పుడు చైర్మన్ కి ఉన్న అధికారాలే ఈ సభా నిర్వాహకుడికి కూడా ఉంటాయి. కొత్త జాబితాలో వైస్ చైర్ పర్సన్లని నామినేట్ చేసే వరకు అతను ఈ పదవిని నిర్వహిస్తారు. జాబితాలో ఉన్న ఏ సభ్యుడు సభలో లేకపోతే సభ నిర్ణయించిన ఏ వ్యక్తి అయినా చైర్మన్ గా వ్యవహరించవచ్చు.

          చైర్మ‌న్‌ లేదా డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు వైస్ చైర్ పర్సన్ జాబితాలోని ఏ సభ్యుడు సమావేశాలని నిర్వహించరాదు. ఇటువంటి సమయంలో సభని నిర్వహించడానికి రాష్ట్రపతి నియమించిన సభ్యుడు చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తాడు.

 

పార్లమెంట్ సచివాలయం

           పార్లమెంట్ లోని ప్రతి సభకు ప్రత్యేకమైన సచివాలయ సిబ్బంది ఉంటుంది. కొన్ని పదవులు రెండు సభలకు కలిపి ఉంటాయి. వారి ఎంపిక మరియు సర్వీస్ నిబంధనలను పార్లమెంట్ క్రమబద్ధం చేస్తుంది. ప్రతి సభ యొక్క సచివాలయానికి అధినేతగా సెక్రటరీ జనరల్ ఉంటాడు. ఇతన్ని సభలోని అధ్యక్షుడు నియమిస్తారు. ఇతను శాశ్వత ఉద్యోగి.

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల కాల‌ప‌రిమితి

 రాజ్యసభ కాలపరిమితి

       రాజ్యసభ 1952లో ఏర్పడింది. ఇది నిరంతరం కొనసాగే సభ. శాశ్వత సభ. రద్దు కాదు. అయితే రెండేళ్ల‌కోసారి మూడో వంతు మంది సభ్యులు రిటైరవుతారు. వారి సీట్లకి కొత్తగా ఎన్నికలు జరుగుతాయి. రిటైరయిన సభ్యులు తిరిగి ఎన్నిక కావడానికి కానీ, నామినేట్ కావడానికి అర్హత ఉంది.

        రాజ్యసభ సభ్యుల పదవీ కాలాన్ని రాజ్యాంగం నిర్ణయించలేదు. ఆ నిర్ణయాన్ని పార్లమెంట్‌కు వదిలేసింది. ఈ కారణంగా పార్లమెంట్ ప్రజా ప్రాతినిథ్య చట్టం (1951) ద్వారా రాజ్యసభ సభ్యుల కాలపరిమితిని 6 సంవత్సరాలకు పెంచింది. మొదటి రాజ్యసభలో సభ్యుల పదవీకాలాన్ని తగ్గించే అధికారాన్ని ఈ చట్టం రాష్ట్రపతికి ఇచ్చింది. మొదటి బ్యాచ్ లో ఒక లాటరీ పద్ధతిలో ఎవరు రిటైర్ కావాలో నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుల యొక్క రిటైర్మెంట్ ఆర్డర్‌ను అమలు చేయడానికి అంశాలను పొందుపరిచే అధికారం కూడా ఈ చట్టం రాష్ట్రపతికి ఇచ్చింది,

లోక్‌సభ కాలపరిమితి

        రాజ్యసభలా లోక్‌సభ నిరంతరం కొనసాగ‌దు. ఏర్పడిన తేదీ నుండి 5 సంవత్సరాలు కొన‌సాగుతుంది. తర్వాత రద్దు అవుతుంది. అయితే రాష్ట్రపతి 5 సంవత్సరాల ముందే స‌భ‌ను చేయవచ్చును. దీన్ని కోర్టుల్లో సవాలు చేయరాదు.

         అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక శాసనం ద్వారా లోక్‌సభ కాలపరిమితి పొడగించవ‌చ్చు. ఒక సమయంలో ఒక సంవత్సరానికి మించి పొడగించొద్దు. అత్యవసర పరిస్థితి రద్ద‌య్యా 6 నెలల కంటే ఎక్కువ కాలం పొడగించరాదు.

పార్లమెంట్‌లో సభ్యత్వం

       పార్లమెంట్ లో సభ్యత్వం పొందడానికి రాజ్యాంగం క్రింది అర్హతలను నిర్దేశించింది.

  • అతడు భారతీయ పౌరుడై ఉండాలి.
  • ఎన్నికల కమిషన్ సూచించిన అధికారి ఎదుట అతడు ప్రమాణం లేదా ప్రతిజ్ఞ చేయాలి. అతడు తన ప్రమాణంలో రాజ్యాంగం యెడల యదార్థ శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, దేశ సౌర్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్ధిస్తానని, ప్రతిజ్ఞ చేయాలి.
  • రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కనిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలు మరియు లోకసభ సభ్యత్వానికి 25 సంవత్సరాలు ఉండాలి.
  • పార్లమెంట్ చేత నిర్దేశించబడిన ఇతర అర్హతలు ఉండాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ద్వారా పార్లమెంట్ ఈ క్రింది అదనపు అర్హతలను పేర్కొన్నది.
    • 1. ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో అతడు ఓటరై ఉండాలి. ఈ సూత్రం రెండు స‌భ‌ల‌కు వర్తిస్తుంది. ఒక రాష్ట్రం నుండి అదే రాష్ట్రానికి చెంది ఉండాల‌నే రూల్ ను 2003లో తొలగించారు. 2006లో సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది.
    • 2. ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వుకాబడిన నియోజక వర్గానికి పోటీ చేయవలిసిన వ్యక్తి ఆ వర్గానికి చెందిన సభ్యుడై ఉండాలి. అయితే ఈ సభ్యులు తనుకు రిజర్వు కాని నియోజక వర్గాలలో పోటీ చేయవచ్చును.

 

అనర్హతలు

          రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఈ క్రింది అంశాల ద్వారా అనర్హుడు అవుతాడు.

  • అతడు కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నిర్వహణలో ఉండిన ఎడల. (మంత్రికి లేదా పార్లమెంట్ మినహాయించిన ఇతర ఉద్యోగాలకు తప్ప)
  • అతనిని చిత్త చాంచల్యం గల వ్యక్తిగా కోర్టు ప్రకటిస్తే
  • అతడు విడుదల చేయబడని దివాళా దారుడైతే
  • అతడు భారతీయ పౌరుడు కాకుండా ఉంటే లేదా స్వచ్ఛందంగా వేరే దేశపు పౌరసత్వాన్ని స్వీకరిస్తే లేదా ఒక విదేశం పట్ల విధేయత ప్రకటించిన ఎడల.

         ప్రజాప్రాతినిథ్య చట్టం (1951) ద్వారా పార్లమెంట్ ఈ క్రింది అనర్హతలను అదనంగా పొందుపరిచింది.

  • ఎన్నికలలో అతడు అవినీతి కార్యకలాపాలకు మరియు నేరాలకు పాల్పడరాదు.
  • రెండు లేదా ఎక్కువ సంవత్సరాలు జైలులో ఉండి ఉండరాదు. కానీ ప్రిమెటీవ్ డిటెన్సన్ చట్టం కింద నిర్బంధించబడిన వ్యక్తి ఇది వర్తించదు.
  • నిర్దేశిత కాల పరిమితిలో అతడు తన ఎన్నికల ఖర్చు వివరా లను దాఖలు చేయడంలో వైఫల్యం చెంది ఉండరాదు.
  • ప్రభుత్వ కాంట్రాక్టులలో, పనులలో మరియు సర్వీసులలో అతడికి జోక్యం ఉండరాదు.
  • ప్రభుత్వానికి కనీసం 25 శాతం భాగస్వామ్యం ఉన్న కార్పోరేషనల్ అతడు డైరెక్టర్ గా కానీ మేనేజింగ్ ఏజెంట్ గా కానీ ఉండకూడదు.
  • రాజ్యాంగం ఎడల అవిశ్వాసం వలన కానీ, లేదా అవినీతికి పాల్పడటం వలన కానీ, అతడు ప్రభుత్వ సర్వీసుల నుండి తొలగింప బడి ఉండరాదు.
  • వివిధ వర్గాల మధ్య వైషమ్యాన్ని పెంపొందించడం లేదా లంచం తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడి ఉండరాదు.
  • అంటరాని తనం, వరకట్నం మరియు సతి వంటి అసాంఘిక నేరాలను ఆచరించడం లేదా బోధించడం వంటి చర్యల కారణంగా అతనికి శిక్షించడకూడదు.

          పైన పేర్కొన్న అర్హతలకు ఏదైనా సభ్యునికి వర్తిస్తాయో, లేదా అనే విషయాన్ని నిర్ధారించడంలో రాష్ట్రపతి నిర్ణయం అంతిమంగా ఉంటుంది. అయితే, ఎన్నికల కమీషన్ నుండి అతడు అనుమతి తీసుకొని తగిన విధంగా ప్రవర్తించాలి.

 

పార్టీ ఖీ రాయింపుల కారణంగా అనర్హత

         పదవ షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపు కారణాలపై అనర్హతకు గురి కాబడే పార్లమెంట్ సభ్యుడు సభ్యుడిగా ఉండటానికి అనర్హు డవుతాడని రాజ్యాంగం పేర్కొంటుంది. ఈ పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం ఒక సభ్యుడు ఈ క్రింది కారణాలపై అనర్హుడు అవుతాడు.

  • ఏ రాజకీయ పార్టీ టికెట్టు ద్వారా తాను గెలుపొందాడో పార్టీ సభ్యత్వాన్ని అతడు స్వచ్ఛందంగా వదలు కోవడం;
  • తన రాజకీయ పార్టీ ఆదేశానికి విరుద్ధంగా సభలో అతడు ఓటు వేయడం లేదా గైర్హాజరవడం;
  • స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థి ఏదైనా రాజకీయ పార్టీలో చేరడం;
  • ఏదైనా నామినేటెడ్ సభ్యుడు ఏవైనా రాజకీయ పార్టీలో చేరడం.

          పదవ షెడ్యూల్ లో నిర్దేశించపబడిన అనర్హత వివాదాలను సంబంధిత సభలోని అధ్యక్షుడు నిర్ణయిస్తారు. అనగా రాజ్యసభ అయితే దాని చైర్మన్ మరియు లోకసభ అయితే దాని స్పీకర్ నిర్ణయిస్తారు. వీటిని రాష్ట్రపతి నిర్ణయించరు. అయితే, చైర్మన్ ! స్పీకర్ నిర్ణయాలు న్యాయసమీక్ష పరిధి క్రిందికి వస్తాయని సుప్రీంకోర్టు 1992లో తీర్పు నిచ్చింది.

 

సీట్ల ఖాళీ

ఈ క్రింది సందర్భాలలో పార్లమెంట్ సభ్యుడు తన సభ్యత్వాన్ని వదులు కోవలసి వస్తుంది.

1. ద్వంద్వ సభ్యత్వం

ఒక వ్యక్తి రెండు సభలలో ఒకేసారి సభ్యునిగా ఉండరాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951) ఈ క్రింది అంశాలని పొందుపరిచింది.

  • ఎవరైనా వ్యక్తి పార్లమెంట్ లో రెండు సభలకు ఎన్నుకో బడినట్లయితే, అతడు 10 రోజులలో తాను ఏసభలో సేవలందించాలని కోరుకుంటున్నాడో తెలియ పరచాలి. ఆ విధంగా అతడు తెలియపరచక పోతే, అతడి రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుంది. ఆ సీటు ఖాళీ ఉంటుంది.
  • ఒక సభలోని ప్రస్తుత సభ్యుడు ఇంకొక సభకు ఎన్నుకో బడితే, అతని మొదటి సభలోని సభ్యత్వం రద్దయి, ఆ సీటు ఖాళీ అవుతుంది.
  • ఎవరైనా వ్యక్తి సభలో రెండు సీట్లకు ఎన్నికయితే, అతడు ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలి. లేని ఎడల, రెండు సీట్లు కూడా ఖాళీ అవుతాయి.

అలాగే ఏ వ్యక్తి కూడా పార్లమెంట్ లోను మరియు రాష్ట్ర శాసన సభలోనూ సభ్యుడై ఉండగాదు. ఒక వేళ ఎవరైనా చేయకపోతే, అతడి పార్లమెంట్ సభ్యత్వ సీటు ఖాళీ అవుతుంది. వ్యక్తి ఆవిధంగా సభ్యత్వానికి 14 రోజుల లోపల రాజీనామా

అనర్హ‌త

       రాజ్యాంగంలో ప్రత్యేకంగా నిర్దేశించబడిన అనర్హతల ద్వారా ఒక పార్లమెంట్ సభ్యుడు అనర్హుడవుతే, అతని సీటు ఖాళీ అవుతుంది. పదవ షెడ్యూల్ లో పేర్కొనిన పార్టీ ఫిరాయింపు అనర్హతలు కూడా ఈ జాబితాలో ఉంటాయి.

రాజీనామా

        ఒక సభ్యుడు తన సంబంధిత సభలోని సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చును. అతడు రాజ్యసభ సభ్యుడు అయినట్లయితే, రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కి ఇవ్వాలి. అతడు లోక్ సభ సభ్యుడయితే, రాజీనామా లేఖని లోక్ సభ స్పీకర్ కి ఇవ్వాలి. అయితే, ఆ రాజీనామాలో స్వచ్ఛందత లేదా సమంజ సత్వం లేదని చైర్మన్ / స్పీకర్ భావిస్తే, ఆ రాజీనామాను వారు ఆమోదించక పోవచ్చును.

గైర్హాజరు

         ఒక సభ యొక్క సభ్యుడు గనుక దాని అనుమతి లేకండా వరుసగా 60 రోజులు సమావేశాలకి గైర్హుజరు అయినట్ల యితే, ఆ సభ్యుని సభ్యత్వం రద్దఅవుతుంది. ఈ 60 రోజుల కాల వ్యవధిని లెక్కించడంలో సభ వాయిదా పడిన కాలం లేక వరుసగా నాలుగు రోజుల కన్నా ఎక్కువ కాలం వాయిదా పడిన రోజులు పరిగణన లోనికి రావు.

ఇతర సందర్భాలు

       పార్లమెంట్ లో ఒక సభ్యుని సీటు ఈ క్రింది పరిస్థితులలో కూడా ఖాళీ అవుతుంది.

  • (a). న్యాయస్థానం అతని ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పటం; (b). సభ నుండి అతడు బహిష్కరించ బడటం;
  • (C). రాష్ట్రపతి పదవికి కానీ లేదా ఉప రాష్ట్రపతి పదవికి
  • కానీ అతడు ఎన్నిక కావడం; మరియు
  • (d). ఒక రాష్ట్రానికి అతడు గవర్నర్‌గా నియమింపబడటం.

        ఒకవేళ అనర్హతకు గురైన వ్యక్తి పార్లమెంట్ కి ఎన్నుకోబడితే, అతని ఎన్నికను చెల్లదని ప్రకటించడానికి రాజ్యాంగంలో ఎటువంటి పద్ధతి లేదు. ప్రజా ప్రాతినిథ్య చట్ట (1951) ఈ విషయాన్ని పొందు పరిచింది. దీని ప్రకారం అనర్హతకు గురైన వ్యక్తి ఎన్నిక చెల్లదని ప్రకటించే అధికారం హైకోర్టుకు ఇవ్వబడింది. బాధితుడైన వ్యక్తి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును.

 

ప్రమాణం

        ప్రతి పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ లేక లోక్ సభ) సభ్యుడిగా అర్హత పొందాలంటే రాష్ట్రపతి ఎదుట గానీ లేక రాష్ట్రపతి ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి ఎదుట గానీ ప్రమాణం లేదా ప్రతిజ్ఞ చేయాలి. తన ప్రమాణం లేదా ప్రతిజ్ఞలో ఒక పార్లమెంట్ సభ్యుడు, తాను…

  • భారత రాజ్యాంగం ఎడల యదార్థ శ్రద్ధా నిష్టలను కలిగి ఉంటానని;
  • భారతదేశ సార్వభౌమాధికారాన్ని, అఖండ తను సమర్థిస్తానని; మరియు
  • తాను చేపట్టిన కర్తవ్యాలను శ్రద్ధగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తారు.

        ప్రమాణ స్వీకారం చేయని సభ్యునికి సభా కార్యక్రమాలలో పాల్గొనే అధికారం కానీ మరియు ఓటువేసే అధికారం కానీ ఉండవు. అతడిని పార్లమెంటరీ ప్రత్యేక హక్కులు గానీ లేదా మినహాయింపు గానీ ఉండవు.

       ఈ క్రింది పరిస్థితులలో ఒక సభ్యుడిగా ఒక వ్యక్తి హాజరై మరియు ఓటింగ్ లో పాల్గొంటే, అతడికి రోజుకి 500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.

  • నిర్దేశించబడిన నమూనా ప్రకారం ప్రతిజ్ఞ మరియు ప్రమాణం చేయక ముందు హాజరవటం; లేదా
  • తనకు సభ్యుడిగా ఉండటానికి అర్హత లేదని లేదా తాను సభ్యత్వానికి అనర్హుడనని తెలిసి కూడా అతడు సభలో హాజరైనప్పుడు, లేదా
  • ఏదైనా పార్లమెంట్ చట్టం ప్రకారం తాను సభలో హాజరు కావడానికి మరియు ఓటు వేయడానికి అనర్హుడనని అతడికి తెలిసి కూడా సభలో హాజరైనప్పుడు.

 

జీత భత్యాలు

        పార్లమెంట్ లోని ఉభయసభల సభ్యుల జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీరి పెన్షన్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించడం జరగలేదు. అయితే, పార్లమెంట్ వీరికి పెన్షన్ పొందే సౌకర్యం ఇస్తుంది.

       పార్లమెంట్లో ఒక సభ సభ్యునిగా ప్రతి ఐదు సంవత్సరాలకు క్రమబద్ధమైన శ్రేణి ప్రాతిపదికపై సభ్యులు 1976 నుండి పెన్షన్ కి అర్హతను పొందారు. ఇంతేగాక, వీరికి ప్రయాణ సౌకర్యాలు, ఉచిత నివాసం, టెలిఫోన్, మెహికల్ అడ్వాన్స్, వైద్య సౌకర్యాలు మొదలగునవి ఇవ్వబడతాయి.

       లోక్ సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ జీత భత్యాలను కూడా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వాటిని భారత సంచిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి, ఇవి పార్లమెంట్ వార్షిక ఓటుకి ఆధీనం కావు.

 

పార్లమెంట్ నాయకులు

సభా నాయకుడు

          లోక్ సభ నిబంధనల ప్రకారం లోక్ సభలో సభ్యుడైన ప్రధానిని సభా నాయకుడు అని వ్యవహరిస్తారు. ఇంతేకాక లోకసభ సభ్యుడైన ప్రధాని చేత నామినేట్ అయిన మంత్రి కూడా సభా నాయకుడిగా వ్యవహరించవచ్చు. ఇలాగే రాజ్యసభలో కూడా సభా నాయకుడు ఉంటాడు. ఇతను రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాని చేత నామినేట్ కాబడ్డ మంత్రి, ప్రతి సభలోను ఉన్న సభా నాయకుడు ప్రముఖమైన విధులను నిర్వహిస్తూ సభా కార్యక్రమాల్లో ప్రముఖమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఇతను సభకి డిప్యూటీ లీడర్ ని నామినేట్ చేయవచ్చును. అమెరికాలో ఇటువంటి ప్రధాన వ్యక్తిని ‘మెజారిటీ నాయకుడు’ అని అంటారు.

ప్రతిపక్ష నాయకుడు

         పార్లమెంట్ లో ప్రతి సభలో ప్రతిషక్ష నాయకుడు ఉంటాడు. సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతుకు తగ్గని సీట్లున్న పార్టీ నేతకి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు రావాలి. పార్లమెంటరీ తరహా వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడికి ప్రముఖమైన పాత్ర ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పర్చడం ఇతని ప్రధాన విధి. ఈ కారణంగా 1977లో లోక్ సభ మరియు రాజ్య సభల్లో ప్రతిపక్ష నాయకుడికి చట్టబద్ధమైన హెూదా కల్పిడమైనది. క్యాబినేట్ మంత్రితో సమానంగా వీరికి జీతభత్యాలు, సదుపాయాలు ఇవ్వబడతాయి. 1969లో ప్రతిపక్ష నాయకునికి అధికారికంగా గుర్తింపు మొదటిసారి వచ్చింది. ఇటువంటి అధికారాన్ని అమెరికాలో “మైనారిటీ నాయకుడు” అంటారు.

        బ్రిటీష్ రాజకీయ వ్యవస్థలో “షాడో కాబినెట్”అనే ఒక ప్రత్యేక సంస్థ ఉంది. దీన్ని ప్రతిపక్ష పార్టీ ఏర్పరుస్తుంది. అధికార క్యాబినెటికి సమాంతరంగా ప్రతిపక్ష పార్టీ షాడో కాబినెట్ ద్వారా భవిష్యత్తులో సభ్యులు మంత్రులుగా ఉండటానికి తగిన శిక్షణ ఇస్తుంది. ఈ షాడో క్యాబినెట్‌లో ప్రతి అధికార కేబినెట్ మంత్రికి నీడగా ప్రతిపక్ష కేబినెట్ మంత్రి ఉంటాడు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎప్పుడు మార్పు వచ్చినా తక్షణం ప్రతిపక్ష పార్టీ తన ప్రత్యామ్నాయ క్యాబినెట్ తో సిద్ధంగా ఉంటుంది. ఈ కారణంగా ఐవర్ జెన్నింగ్స్ ప్రతిపక్ష నాయకున్ని “ప్రత్యా మ్నాయ ప్రధాన మంత్రి” అన్నారు. ఇతనికి మంత్రికి ఉన్న హెూదా ఉంటుంది. ప్రభుత్వం ఇతనికి జీతం చెల్లిస్తుంది.

 

విప్ (Whip)

      రాజ్యాంగంలో సభా నాయకుడు మరియు ప్రతిపక్ష నాయకుడి పదవుల గురించి ప్రస్తావించక‌పోయినా పార్లమెంటరీ చట్టంలో మరియు సభా నిబంధనలో పేర్కొన్నారు. అయితే విప్ అనే పదం రాజ్యాంగంలో కాని, పార్లమెంటరీ శాసనంలో కాని సభా నిబంధనలలో కాని పేర్కొనలేదు. పార్లమెంటరీ ప్రభుత్వంలోని సాంప్రదాయాల ఆధారంగా ఈ పదని ఏర్పడింది.

        అధికార పార్టీ అయిన లేదా ప్రతిపక్షం అయినా లేదా ప్రతి రాజకీయ పార్టీకి పార్లమెంట్ లో సొంత విప్ ఉంటాడు. ఫ్లోర్ లీడర్ కు అసిస్టెంట్ గా ఉండటానికి ప్రతి రాజకీయ పార్టీ ఇతన్ని నియమిస్తుంది. సభలో తమ పార్టీ సభ్యులు బాధ్యతగా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే బాధ్యతని విప్ స్వీకరిస్తారు. పార్టీ ఆదేశాల ప్రకారం సభ్యులు ఒక రాజకీయ సమస్యకి మద్దతు ఇవ్వటానికి కాని ఇవ్వకపోవడానికి కాని అవసరమైన నిర్ణయాలు ఇతను చేస్తాడు. సభ్యులందరూ విప్ ఆదేశాలని పాటించాలి. లేకపోతే క్రమశిక్షణా చర్య తీసుకోబడుతుంది.

పార్లమెంట్ నిర్మాణం

           కేంద్రంలో పార్లమెంట్ శాసనపరమైన అంగం. వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వంగా పేర్కొనబడిన పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కీలక స్థానాన్ని పొందింది. ఈ పార్లమెంట్ నిర్మాణం, కాలపరిమితి, అధికారులు, పద్ధతులు, ప్రత్యేక అధికారాలు, విధుల గురించి రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుండి 122 ఆర్టిక‌ల్స్ వివరిస్తాయి.

పార్లమెంట్ నిర్మాణం

        రాజ్యాంగం ప్రకారం మ‌న‌ పార్లమెంటులో 3 భాగాలు ఉన్నాయి. అవి రాష్ట్రపతి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాష్ట్రాల సభ) మరియు హౌస్ ఆఫ్ పీపుల్ (లోక్‌స‌భ‌).1954లో వీటికి హిందీ పేర్లు రాజ్యసభ, లోక్ సభ పెట్టారు. రాజ్యసభ ఎగువ సభ (రెండవ సభ లేదా పెద్దల సభ). లోక్ సభ దిగువ సభ (మొదటి సభ లేదా ప్రజల సభ). 

        రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యాసభ ప్రాతినిథ్యం వహిస్తుంది. దేశప్రజలకు లోకసభ ప్రాతినిధ్యం వహిస్తుంది.

       రాష్ట్రపతి పార్లమెంట్ లో ఏ సభలోనూ సభ్యుడు కాడు. ఏ సమావేశాల్లోనూ పాల్గొనడు. అయినా ఆయన పార్లమెంట్ లో భాగం. ఎందుకంటే పార్లమెంటులో ఆమోదించిన‌ బిల్లు అతడు ఆమోదించకపోతే చట్టం కాలేదు. అలాగే పార్లమెంట్ కి సంబంధించిన కొన్ని విధులు కూడా ఆయనకు ఉన్నాయి. రెండు సభలను సమావేశపరచడం, సమాపనం చేయడం, లోక్‌సభను రద్దు చేయడం, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం మరియు పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేయడం లాంటివి.

       పార్ల‌మెంటు విషయంలో మ‌న‌ రాజ్యంగ నిర్మాతలు అమెరికా పద్ధతి కాకుండా బ్రిటిష్ పద్ధతిని ఆమోదించారు. బ్రిటన్‌లో పార్లమెంట్ లో చక్రవర్తి (రాజు లేక రాణి), ప్రభువుల సభ (ఎగువ సభ) మరియు సామాన్యుల సభ (దిగువ సభ) ఉంటాయి. అమెరికాలో అధ్యక్షుడు శాసనసభలో భాగం కాదు. అమెరికన్ శాసనసభను కాంగ్రెస్ అంటారు. ఇందులో రెండు సభలు ఉంటాయి. అవి సెనేట్ (ఎగువ సభ), ప్రతినిధుల సభ (దిగువ సభ).

         శాసనసభ మరియు కార్య నిర్వాహక వర్గం మధ్య పరస్పర సంబంధాలకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రాధాన్యం నిస్తుంది. అందుకే మన పార్లమెంట్ లో రాష్ట్రపతి మరియు బ్రిటిష్ పార్లమెంట్ లో చక్రవర్తి ఉంటారు. కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కాంగ్రెస్ లో అమెరికా అధ్యక్షుడు భాగం కాదు. ఈ వ్యవస్థలో అధికార వేర్పాటు సిద్ధాంతం ఉన్నది.

 

రాజ్యసభ నిర్మాణం

          రాజ్యసభలో మొత్తం సభ్యుల గరిష్ట సంఖ్య 250. ఇందులో 238 మంది ప్రతినిధులు రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. 229 మంది సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తుండ‌గా నలుగురు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ లో రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల సంఖ్యను పొందుపరచడమైనది.

రాష్ట్రాల ప్రాతినిథ్యం: రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించే రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధానసభలలోని సభ్యులు ఎన్నుకుంటారు. దామాషా పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ ఫర‌బుల్ ఓటు పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రంలోని జనాభా ప్రాతిపదికపై రాజ్యసభ సభ్యుల సంఖ్య నిర్ణయమవుతుంది. కనుక రాష్ట్రాల ప్రాతినిథ్యంలో తేడాలొస్తాయి. ఉత్తరప్రదేశ్ నుండి 31 మంది సభ్యులు ఉండగా త్రిపుర నుండి ఒకే సభ్యుడు ఉంటారు. అమెరికాలో మాత్రం జనాభాతో ప‌ని లేకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిథ్యం ఉంటుంది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులు సెనేట్ లో ఉంటారు. కనుక సెనేట్ లో సభ్యుల సంఖ్య 100.

కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిథ్యం: ప్రత్యేకంగా నిర్దేశించబడిన ఒక ఎన్నికల గణం ద్వారా పరోక్షంగా కేంద్ర పాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకు సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక కూడా దామాషా పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ ఫర‌బుల్ ఓటు పద్ధతిలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుండే (ఢిల్లీ, పాండిచ్చేరి, జ‌మ్మూకాశ్మీర్‌) రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జనాభా చాలా తక్కువ కావడం వలన ఆ ప్రాంతాల నుండి రాజ్యసభలో సభ్యులు లేరు.

నామినేటెడ్ సభ్యులు: కళలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం మరియు సామాజిక సేవలో నిష్ణాతులైన లేదా అనుభవం ఉన్న‌ రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులుగా నామినేట్ చేస్తారు. ఎన్నికల్లేకుండా నిష్ణాతులకు రాజ్యసభలో స్థానం కలిగించడం దీని ఉద్దేశం. అమెరికా సెనేట్ లో నామినేటెడ్ సభ్యులు ఉండరు.

 

లోక్‌సభ నిర్మాణం

         లోక్ సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం 104వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా దీన్ని తీసేశారు. ప్ర‌స్తుతం లోక్‌సభలో 545 మంది సభ్యులు ఉన్నారు.

రాష్ట్రాల ప్రాతినిథ్యం: లోక్‌సభలో రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యులను ప్రజలు తమ నియోజక వర్గాల నుండి ఎన్నుకుంటారు. సార్వజనీన వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగ సూత్రాల ద్వారా కానీ లేదా ఏదైనా శాసనం ద్వారా కానీ అనర్హతకు గురికాని 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరునికి ఓటు వేసే హక్కు ఉంది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవ్స‌రాల‌కు తగ్గించడం జరిగింది.

కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిథ్యం: కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల ఎంపిక విధానాన్ని పార్లమెంట్ ప్రత్యేక శాసనం ద్వారా నిర్ణయిస్తుందని రాజ్యాంగం పేర్కొన్నది. కాబ‌ట్టి యూనియన్ టెరిటరీస్ (డైరెక్ట్ ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ ది పీపుల్) చట్టం 1965 ఆమోదించింది. దీని ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాల నుండి లోక్‌సభ సభ్యులు ఎన్నికవుతారు.

నామినేటెడ్ సభ్యులు: లోక్ సభలో సరిపోనంత ప్రాతినిధ్యం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి లేదని రాష్ట్రపతి భావించి నప్పుడు, ఆయన ఈ కమ్యూనిటీ నుండి ఇద్దరు సభ్యులను నామినేట్ చేయవచ్చును. మొట్టమొదట 1960 వరకే దీనిని పొందు పరచడం జరిగింది. కానీ 96వ రాజజ్యాంగ సవరణ చట్టం, 2009 ద్వారా దీనిని 2020 వరకు పొడగించడం జరిగింది. తాజాగా 104వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా దీన్ని తొలగించారు.

 

లోక్‌స‌భ‌కు ఎన్నిక‌ల విధానం

భౌగోళిక నియోజ‌క‌వ‌ర్గాలు

       లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ప్ర‌తి రాష్ట్రాన్ని భౌగోళిక నియోజ‌క‌వ‌ర్గాలు విభ‌జిస్తారు. ఈ విష‌యంలో రాజ్యాంగం రెండు అంశాల‌ను ప్ర‌స్తావిస్తుంది.

  • ప్రతి రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎంతమంది ఎన్నిక కావాలో ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. జనాభాకు, లోక్ సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంత వరకు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండాలి. ఒక రాష్ట్ర జనాభా 6 మిలియన్ల కన్నా తక్కువ ఉంటే ఈ సూత్రం వర్తించదు.
  • ప్రతి రాష్ట్రాన్ని భౌగోళిక నియోజక వర్గాలుగా విభజిస్తారు. భౌగోళిక నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గ జనాభాకి ఉండే నిష్పత్తి కూడా రాష్ట్రం మొత్తానికి ఒకేలా ఉండాలి.

         అంటే రాజ్యాంగం రెండు విషయాల్లో ఒకే ప‌ద్ధ‌తిని కోరుకుంటోంది. అవి రాష్ట్రాల మధ్య మరియు ఒకే రాష్ట్రంలో వివిధ నియోజక వర్గాల మధ్య

 

ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత సర్దుబాటు

         ప్రతి జనాభా లెక్కల తర్వాత రాష్ట్రాలకు లోక్ సభలో సీట్ల కేటాయింపు మరియు భౌగోళిక నియోజకవర్గాలుగా ప్రతి రాష్ట్రం విభజన స‌ర్దుబాటు జ‌ర‌గాలి. పార్లమెంట్‌కు ఈ విషయంలో అధికారం ఉంది. దీని కోసం పార్లమెంట్ 1952, 1962, 1972 మరియు 2002లో డిలిమిటేషన్ కమీషన్లను నియమించింది.

         42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో లోక్ సభ స్థానాల సంఖ్యను స్థిరీకరించారు. దీని ప్రకారం 2000 సంవత్సరం వరకు లోక్ సభ స్థానాల సంఖ్యను 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించడం జరిగింది. 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా ఈ నిషేధాన్ని మరొక 25 సంవత్సరాల పాటు 2026 వరకు పొడిగించారు.

         84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ప్రకారం ప్రభుత్వం 1991 జనాభా లెక్కల ప్రాతిపదికపై రాష్ట్రాలలో భౌగోళిక (ప్రాదేశిక) నియోజకవర్గాలను హేతుబద్ధంగా తిరిగి సర్దుబాటు చేయాలి. కానీ 87వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ఈ విషయంలో కొత్త సవరణ తెచ్చింది. 1991 జనాభా పరంగా కాకుండా 2001లో ఉన్న జనాభా లెక్కల మేరకు ఈ ఫుసర్ విభజన (మళ్లీ సర్దుబాటు) జరగాలి అని పేర్కొన్నది. అయితే ప్రతి రాష్ట్రంలో లోక్‌స‌భకు కేటాయించిన సీట్లలో మార్పు ఉండొద్దు.

 

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకి సీట్ల రిజర్వేషన్లు

      మతపరమైన ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగం నిషేధించినా ఎస్సీ మరియు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన పై సీట్ల రిజర్వేషన్లు పొందుపరిచింది.

       మొదట్లో రిజర్వేషన్లను పది సంవత్సరాల (1960) వ‌ర‌కు పొందుప‌రిచారు. త‌ర్వాత ప్రతి 10 సంవత్స‌రాల‌కు వాటిని పెంచడం జరిగింది. 95వ రాజ్యాంగ సవరణ చట్టం (2009) ప్రకారం వీటిని 2020 వరకు పొడిగించ‌గా తాజాగా 104వ స‌వ‌ర‌ణ ద్వారా 2030 వ‌ర‌కు పొడిగించారు.

       షెడ్యూల్డ్ కులాలకి మరియు షెడ్యూల్ తెగల‌కు రిజర్వేషన్లు కేటాయించినా వారిని నియోజకవర్గాల్లో ఓటర్లందరూ ఎన్నుకుంటారు. ప్రత్యేకమైన ఓటర్లు ఉండరు. ఎస్సీ మరియు ఎస్టీలకు చెందిన సభ్యుడు జనరల్ సీటుకి పోటీ చేయడంలో నిషేధం లేదు.

        84వ రాజ్యాంగ సవరణ చట్టం(2001) ప్రకారం 1991 జనాభా లెక్కల ప్రకారం రిజర్వుడ్ సీట్లని హేతుబద్ధంగా తిరిగి సర్దుబాటు చేయాలి. కానీ 87వ రాజ్యాంగ సవరణ చట్టం (2003), 1991ని 2001గా మార్చింది.

 

నైష్ప‌త్తిక‌ ప్రాతినిధ్యాన్ని ఆమోదించలేదు

       నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిని రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యాంగం పొందుపరిచినా లోక్ సభ ఎన్నికల్లో దాన్ని ఆమోదించ‌లేదు. దీనికి బదులుగా లోక్ సభ ఎన్నికలలో భోగోళిక ప్రాతినిధ్య పద్ధ‌తిని ఆమోదించారు.

       భౌగోళిక ప్రాతినిథ్య పద్ధతి ప్రకారం ప్రతి శాసనసభ్యుడు ఒక ప్రాదేశిక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. దీన్ని నియోజకవర్గం అంటారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. కనుక దీన్ని ఏకసభ్య నియోజకవర్గం అంటారు. ఈ పద్ధతిలో మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించడం జరుగుతుంది. ఈ సాధారణ మెజారిటీ పద్ధతిలో ఓటర్లందరికీ ప్రాతినిధ్యం ఉండదు. అనగా మైనారిటీలకు (చిన్న గ్రూపులకు) సరైన‌ ప్రాతినిధ్యం ఉండదు.

        నైష్పత్తిక ప్రాతినిధ్య‌ పద్ధతి ద్వారా భౌగోళిక ప్రాతినిధ్య‌ పద్ధతి లోపాలని తొలగించవచ్చును. ఈ పద్ధతిలో ప్రజలందరికీ వారి వారి సంఖ్యను బట్టి ప్రాతినిధ్యం లభిస్తుంది. జనాభాలో అతి చిన్న వర్గానికి కూడా ప్రాతినిధ్యం కలుగుతుంది.

         ప్రాతినిథ్య పద్ధతిలో రెండు రకాలు ఉంటాయి. అవి ఏక బదిలీ ఓటు పద్ధతి మరియు జాబితా పద్ధతి. రాజ్యసభ మరియు రాష్ట్ర విధాన మండలి సభ్యుల ఎన్నికలలో మరియు రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి ఎన్నికలలో మొదటి పద్ధతి అమలులో ఉంది.

         రాజ్యాంగ నిర్మాణసభలో కొంతమంది సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య‌ పద్ధతిని లోక్ సభ ఎన్నికలకు సిఫార్సు చేసినా రాజ్యాంగంలో దీన్ని పొందుపరచక పోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి:

  • దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల‌ క్లిష్టమైన ఈ పద్ధతిని ఓటర్లు అర్ధం చేసుకోలేని అవకాశం ఉండటం.
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతికి అనుగుణంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. ఈ వ్యవస్థలో పెక్కు రాజకీయ పార్టీలు ఏర్పడి అస్థిర ప్రభుత్వాలకి ఈ పద్ధతి ఎక్కువగా దోహదం చేయవచ్చును.

ఈ పద్ధతి ద్వారా కొన్ని లోపాలూ ఉన్నాయి.

  • ఎంతో ఖర్చుతో కూడుకున్నది.
  • ఉప ఎన్నికలు నిర్వహించటానికి అవకాశం ఉండదు. అర్హతలు
  • ఓటర్లకు, ప్రతినిధులకు మధ్య చక్కటి అనుబంధాన్ని ఇది దూరం చేస్తుంది.
  • అల్ప సంఖ్యాక భావనలకు మరియు గ్రూపు ప్రయోజనాలని ఇది దోహదం చేస్తుంది.
  • ఓటర్ల కన్నా పార్టీ వ్యవస్థకి ప్రాధాన్యతనిస్తుంది.


మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 – 1963)

  • పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
  • బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
  • మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
  • 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
  • హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
  • ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
  • తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
  • హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
  • 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
  • అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
  • కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
  • రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.

2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 – 1975)

  • పదవీకాలం: 1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
  • తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
  • అమెరికా ప్రభుత్వం ప్రసాదించే ‘టెంపుల్‌టన్’ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
  • ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  • ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
  • విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
  • విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • 8 దేశాల్లో ‘విజిటింగ్ ప్రొఫెసర్‌’గా పనిచేశారు.
  • ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘ప్రజా దర్బార్‌’ను ఏర్పాటు చేశారు.
  • “Hindu View Of Life”, “All Idealist View Of Life”అనే గ్రంథాలను రచించారు.
  • దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
  • 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
  • ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 – 1969)

  • పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
  • జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
  • కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
  • మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
  • ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
  • అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
  • పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
  • జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో (1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
  • దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.

4. వి.వి. గిరి (1884 – 1980)

  • పదవీకాలం: 1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
  • వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
  • నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
  • అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
  • రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
  • తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
  • కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
  • బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
  • 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
  • ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
  • ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి

5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 – 1977)

  • పదవీకాలం: 1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
  • ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
  • టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
  • ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
  • 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
  • ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని ‘రబ్బర్‌స్టాంప్‌’గా విమర్శకులు పేర్కొన్నారు.
  • ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.

6. నీలం సంజీవ రెడ్డి (1913 – 1996)

  • పదవీకాలం: 1977, జులై 25 నుంచి 1982, జులై 25
  • నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
  • 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
  • ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
  • 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
  • లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
  • ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
  • రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.

7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 – 1994)

  • పదవీకాలం: 1982, జులై 25 నుంచి 1987, జులై 25
  • ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
  • హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
  • మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
  • బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
  • రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై “Pocket Veto”ను వినియోగించారు.
  • వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
  • 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
  • రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
  • ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
  • 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non – Aligned Movements) సదస్సు జరిగింది.

8. ఆర్. వెంకట్రామన్: (1910 – 2009)

  • పదవీకాలం: 1987, జులై 25 నుంచి 1992, జులై 25
  • ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
  • అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
  • కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
  • ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
  • పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
  • 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
  • మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
  • 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.

9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 – 1999)

  • పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
  • ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
  • జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
  • విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
  • ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
  • రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
  • 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
  • దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
  • ‘రాజనీతిజ్ఞ రాష్ట్రపతి’గా పేరుపొందారు.
  • ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.

10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)

  • పదవీకాలం: 1997 జులై 25 నుంచి 2002, జులై 25
  • ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
  • టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • తొలి దళిత రాష్ట్రపతి.
  • పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
  • వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
  • విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
  • ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
  • చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
  • గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
  • లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 – 2015)

  • పదవీకాలం: 2002 జులై 25 నుంచి 2007 జులై 25
  • ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
  • ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
  • భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
  • భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
  • దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
  • వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
  • సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
  • 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
  • 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
  • డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
  • కలాం జన్మదినమైన అక్టోబరు 15న ‘స్టూడెంట్స్ డే’గా నిర్వహిస్తున్నారు.
  • PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
  • కలాం 2015, జులై 27న మరణించారు.

12. ప్రతిభాపాటిల్ (1934)

  • పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
  • ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
  • భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • తొలి మహిళా రాష్ట్రపతి.
  • రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
  • రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  • సుఖోయ్ యుద్ధ విమానం, టీ – 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
  • గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
  • ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
  • బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
  • విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.

13. ప్రణబ్ ముఖర్జీ (1935)

  • పదవీకాలం: 2012 జులై 25 నుంచి – 2017 జూలై 25 వరకు
  • ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా ‘మిరాటి’ గ్రామంలో జన్మించారు.
  • పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1982 – 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
  • 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
  • 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
  • 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
  • 2011లో ‘బెస్ట్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డును అందుకున్నారు.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
  • 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 – 2012 మధ్య వ్యవహరించారు.
  • ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
  • 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
  • లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.

ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు

Advertisement

  • The Dramatic Decade
  • Midterm
  • Off the Track
  • కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.

14. రామ్‌నాథ్ కోవింద్

  • పదవీ కాలం – 2017 జూలై నుంచి..
  • స్వరాష్ర్టం ఉత్తరప్రదేశ్.
  • రాష్ర్టపతిగా ఎన్నికైన రెండో దళితుడు.
  • రాజ్యసభ సభ్యునిగా, బిహార్ గవర్నర్‌గా చేసి రాష్ర్టపతి అయ్యారు.
  • ఈయన 15వ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నికైన 14వ రాష్ర్టపతి.
  • ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన 8వ వ్యక్తి.
  • ఈయన చేతిలో ఓడిపోయినవారు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్.

రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు

  • సుమిత్రాదేవి (1962)
  • మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
  • లక్ష్మీ సెహగల్ (2002)
  • ప్రతిభా పాటిల్ (2007)

తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు

  • వి.వి. గిరి
  • జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
  • బి.డి. జెట్టి

ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు

  • బాబూ రాజేంద్ర ప్రసాద్
  • ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
  • నీలం సంజీవరెడ్డి
  • జ్ఞానీ జైల్‌సింగ్
  • అబ్దుల్ కలాం
  • ప్రతిభా పాటిల్
  • ప్రణబ్ ముఖర్జీ

ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు

  • జి.ఎస్ పాఠక్
  • బి.డి. జెట్టి
  • జస్టిస్ హిదయతుల్లా
  • కె. కృష్ణకాంత్
  • భైరాన్‌సింగ్ షెకావత్

ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు

  • సర్వేపల్లి రాధకృష్ణన్
  • జాకీర్ హుస్సేన్
  • వి.వి. గిరి
  • ఆర్. వెంకట్రామన్
  • శంకర్ దయాళ్‌శర్మ
  • కె.ఆర్. నారాయణన్

భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు

  • సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
  • డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
  • డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
  • వి.వి. గిరి (1975)
  • ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)

పార్ల‌మెంట‌రీ క‌మిటీలు

  • రోజు రోజుకూ శాసనాల సంఖ్య పెరగడం, శాసనాల రూపకల్పనలో సాంకేతికత పెరగడం, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిమాణం లాంటి అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆధునిక కాలంలో శాసనాల రూపకల్పనలో ఈ కమిటీల పాత్ర కీలకమైంది.
  • పార్లమెంటు తరఫున నిపుణులు, సమర్థులైన కొంత మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగిస్తారు.
  • భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ఆర్టికల్ 88, 105లలో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.

వ్యాఖ్యానాలు

  • ‘ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చేతులు, చెవులుగా; కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి’ – థామస్ రీడ్
  • ‘శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి’. – మారిస్ జోన్స్
  • ‘ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి’ – ఉడ్రో విల్సన్.

కమిటీల లక్షణాలు

  • పార్లమెంటరీ కమిటీలకు పుట్టినిల్లు బ్రిటన్.
  • మంత్రులు కమిటీల్లో సభ్యులుగా ఉండకూడదు.
  • కమిటీ తన నివేదికను స్పీకర్ లేదా ఛైర్మన్‌కు సమర్పిస్తుంది.
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.
  • కమిటీ సమావేశాల నిర్వహణకు కావల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరం) 1/3వ వంతు.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
  • కమిటీల్లోని సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.
  • 1997లో రాజ్యసభ నుంచి, 2004లో లోక్‌సభ నుంచి నైతిక విలువల కమిటీలు ఏర్పడి పని చేస్తున్నాయి.

కమిటీలు 2 రకాలు

  • స్థాయి కమిటీలు (Standing Committees)
  • తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)

స్థాయి కమిటీలు

  • ఇవి ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభల ద్వారా ఎన్నికై నిరంతరంగా పని చేస్తుంటాయి. ఈ కమిటీల్లో సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు.

తాత్కాలిక కమిటీలు

  • అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించగానే రద్దు అవుతాయి.

కీలకమైన పార్లమెంటరీ కమిటీలు

ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee)

  • ఇది పార్లమెంటరీ కమిటీల్లో ప్రాచీనమైంది.
  • దీన్ని 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫారసుల మేరకు 1921లో ఏర్పాటు చేశారు.
  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 22. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఈ కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. కమిటీ తన నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది.
  • 1967 నుంచి ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందినవారిని నియమించడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రభుత్వ ఖాతాల సంఘం విధులు

  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం.
  • పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉందో, లేదో పరిశీలించడం.
  • ఖాతాల్లో చూపిన వ్యయం చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చుపెట్టారా లేదా అని పరిశీలించడం.
  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రభుత్వ ఖాతాల సంఘంకు మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగాను పనిచేస్తుంది.
  • కాగ్ నివేదికను ప్రభుత్వ ఖాతాల సంఘం పరిశీలించి అవకతవకలుంటే బాధ్యులపై చర్యలకోసం సిఫారసు చేస్తుంది.
  • ప్రభుత్వ ఖాతాల సంఘంను ముఖ్యమైన ఆర్థిక కమిటీగా పేర్కొంటారు.

అంచనాల సంఘం (Estimates Committee)

  • జాన్ ముత్తాయ్ కమిటీ సిఫారసుల మేరకు 1950లో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీలోని మొత్తం 30 మంది సభ్యులను లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు.
  • ఈ కమిటీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
  • ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది.
  • దీన్ని నిరంతర పొదుపు కమిటీ అంటారు.
  • పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  • ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను పార్లమెంటు కవలలుగా పేర్కొంటారు.

ప్రభుత్వరంగ సంస్థల సంఘం (Committee on Public Undertakings)

  • ప్రభుత్వరంగ సంస్థలపై పార్లమెంటులో లంకా సుందరం అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కృష్ణమీనన్ కమిటీని ఏర్పాటు చేసింది.
  • కృష్ణమీనన్ కమిటీ సిఫారసుల మేరకు 1964లో ‘ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని’ ఏర్పాటు చేశారు.
  • 1974 వరకు ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేవారు.
  • 1974 నుంచి దీనిలోని సభ్యుల సంఖ్యను 22కు పెంచారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన BHEL, BALCO, IOC, LIC లాంటివి సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సూచనలు చేస్తుంది.
  • ప్రభుత్వరంగ సంస్థల నివేదికను, ఖాతాలను పరిశీలిస్తుంది.
  • ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (CAG) నివేదికను పరిశీలిస్తుంది.
  • ఇది కూడా కీలకమైన ఆర్థిక కమిటీ.

సాధారణ కమిటీలు

సభా వ్యవహారాల కమిటీ (Business Advisory Committee)

  • లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఈ కమిటీలు ఉంటాయి.
  • ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
  • లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీలో 15, రాజ్యసభ సభావ్యవహారాల కమిటీలో 11 మంది సభ్యులుంటారు.
  • ఈ కమిటీల్లో సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను సభ్యులుగా ఎంపిక చేస్తారు.
  • సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తూ అందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. ఇది ఎజెండాను తయారు చేస్తుంది.

ప్రభుత్వ హామీల కమిటీ (Committee on Government Assurance)

  • లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలు ఏర్పాటవుతాయి.
  • లోక్‌సభ కమిటీలో 15, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులుంటారు.
  • ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల, తీర్మానాల మీద చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీల అమలు లాంటి విషయాలను కమిటీ పరిశీలిస్తుంది.

ప్రైవేట్ అర్జీల బిల్లుల కమిటీ

  • ఇది లోక్‌సభకే ఉద్దేశించిన కమిటీ. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 15. దీనికి డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడం ఈ కమిటీ ప్రధాన విధి.

దత్త శాసనాల కమిటీ (Committee on Delegated Legislation)

  • దీన్నే నియోజిత శాసనాల కమిటీ అంటారు.
  • ఈ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు.
  • ఈ కమిటీని ‘పార్లమెంటు విధుల రక్షణ కర్త’గా జి.వి.మౌలాంకర్ పేర్కొన్నారు.
  • పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్దతను పరిశీలించడం, గతంలో రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ప్రధాన విధి.

సభాహక్కుల కమిటీ (Committee on Privilege of Members)

  • ఈ కమిటీలు లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఉంటాయి.
  • లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు.
  • ఈ కమిటీ పార్లమెంటు సభ్యుల హక్కులు, హోదాలను పరిరక్షిస్తుంది.
  • దీనికి అర్ధన్యాయ సంబంధమైన (Quasi Judicial) విధులు ఉంటాయి.

షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిటీ

  • ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.
  • జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల నివేదికలను పరిశీలిస్తుంది.

మహిళా సాధికారతా కమిటీ (Committee on Empowerment of Women)

  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • మహిళలకు రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును పర్యవేక్షించి, తన నివేదికను రూపొందిస్తుంది.
  • మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్ సమర్పించిన నివేదికలను పరిశీలించి, సిఫారసులు చేస్తుంది.
  • మహిళా సాధికారిత, సమానత్వం కోసం చేపట్టే కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  • ఈ కమిటీని 1997లో ఏర్పాటు చేశారు.

ఎథిక్స్ కమిటీ (Committee on Ethics)

  • ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో 1997, లోక్‌సభలో 2004లో ఏర్పడింది.
  • సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు లాంటి అంశాలపై సూచనలు ఇస్తుంది.

జీతభత్యాల కమిటీ

  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది.

లైబ్రరీ కమిటీ

  • ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 9. వీరిలో లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సదుపాయాల కల్పనపై సిఫారసు చేస్తుంది.

సాధారణ అవసరాల కమిటీ

  • దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15 మంది. స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు సమావేశాల సందర్భంగా కల్పించాల్సిన వసతుల గురించి ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.

లాభదాయక పదవుల కమిటీ (Committee on Office of Profit)

  • దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15, వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు లాంటి అంశాలను పరిశీలిస్తుంది.

డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలు

  • లోక్‌సభ రూల్స్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలోనూ 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది లోక్‌సభ, మిగిలిన 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు. ఈ కమిటీల సభ్యులను ఆయా సభాధ్యక్షులు నామినేట్ చేస్తారు. ఈ కమిటీల పదవీ కాలం ఒక సంవత్సరం.
  • 16 కమిటీలు లోక్‌సభ, 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.

జాయింట్ పార్లమెంటరీ కమిటీలు (JPC)

  • సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను విచారించేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు.
  • ఉభయసభల తీర్మానాల ద్వారా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయవచ్చు.
  • సుమారు 15 నుంచి 30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీగా ఉంది.

ఇప్పటి వరకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు

  • బోఫోర్స్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు 1987, ఆగస్టు 6న శంకరానంద్ (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, తన నివేదికను 1998, ఏప్రిల్ 26న ఇచ్చింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.
  • స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 1992, ఆగస్టు 6న రాంనివాస్ మిర్థా (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 1993, డిసెంబరు 21న సమర్పించింది.
  • స్టాక్ మార్కెట్ కుంభకోణం (కేతన్ పరేఖ్ కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 2001, ఏప్రిల్ 26న ప్రకాష్‌మణి త్రిపాఠీ (బీజేపీ) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2002 డిసెంబరు 19న సమర్పించింది.
  • శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలపై అధ్యయనం చేసేందుకు శరద్ పవార్ (ఎన్‌సీపీ) అధ్యక్షతన 2003, ఆగస్టు 8న ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2004, ఫిబ్రవరి 4న సమర్పించింది. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉండటం నిజమేనని పేర్కొంది. దీని సిఫారసుల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏర్పడింది.
  • 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు పి.సి. చాకో (కాంగ్రెస్) అధ్యక్షతన 2011, మార్చి 1న ఏర్పడిన ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది.