గాజు

          గృహాలంకరణ వస్తువుల్లో గాజుకే ప్రాధాన్యం ఉంది. గ్లాస్ బ్లోయింగ్‌లో రోమన్‌లదే పైచేయి. ఘనరూపంలో ఉన్నప్పటికీ గాజు నిజమైన స్ఫటిక పదార్థం కాదు. ఇది అస్ఫటిక పదార్థం. గాజు ద్రవాన్ని త్వరగా చల్లబరచడం వల్ల దాని స్నిగ్ధత అధికమై ఘనరూపాన్ని సంతరించుకుంటుంది. అందువల్ల గాజును ‘అతి శీతలీకరణం చెందిన ద్రవం’ అంటారు.

  • గాజు ప్రధానంగా సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల మిశ్రమం.
  • గాజుకు కావాల్సిన ముడి పదార్థాలు సోడాయాష్ (Na2CO3), సున్నపురాయి (CaCO3), ఇసుక (SiO2).
  • ముడి పదార్థాల మిశ్రమ పొడిని ‘బాచ్’ అంటారు.
  • బాచ్ ద్రవీభవన స్థానం (కరిగే ఉష్ణోగ్రత)ను తగ్గించడానికి కొన్ని పగిలిన గాజు ముక్కలను కలుపుతారు. వీటిని ‘కల్లెట్’ అంటారు.
  • మొత్తం మిశ్రమాన్ని కొలిమిలో 1000°C వద్ద వేడి చేస్తే ద్రవగాజు ఏర్పడుతుంది. దీనిపై తేలియాడే మలినాలను ‘గాజుగాల్’ అంటారు.
  • ద్రవ గాజును త్వరగా చల్లబరిస్తే పెళుసుగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా చల్లబరుస్తారు. మంద శీతలీకరణం వల్ల గాజుకు అధిక బలం చేకూరుతుంది.
  • గాజును వివిధ రంగుల్లో పొందడానికి ద్రవగాజుకు కొన్ని లోహ ఆక్సైడ్‌లను లేదా లోహ లవణాలను కలుపుతారు. క్రోమియం ఆక్సైడ్‌తో ఆకుపచ్చ, మాంగనీస్ ఆక్సైడ్‌తో ఊదా, కాపర్ సల్ఫేట్‌తో నీలం, బంగారం క్లోరైడ్‌తో కెంపు, క్యూప్రస్ ఆక్సైడ్‌తో ఎరుపు రంగులు లభిస్తాయి.
  • గాజును ‘ఆక్సిజన్-ఎసిటలీన్’ మంటతో వేడిచేసి మెత్తబరుస్తారు. అందులోకి గాలిని పంపి కోరిన ఆకృతిలో గాజు వస్తువులను తయారు చేస్తారు. ఈ నైపుణ్యాన్నే ‘గ్లాస్ బ్లోయింగ్’ అంటారు.
  • పెరైక్స్ గాజు, బోరోసిలికేట్ గాజు గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలకు అనువైనవి.